'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Oct 9, 2012

మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే

అది ఒక రియాలిటీ షో. 

ఆరేళ్ళ పిల్ల ఒక పిచ్చి తల్లిలాగ అభినయించి ఆక్సిడెంట్ లో చనిపోయిన తన బిడ్డనూహించుకుంటూ పాట పాడి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.

ఆ అమ్మాయి అభినయిస్తున్నంత  సేపు ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

డాన్సు అయిపోగానే వాఖ్యాత ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కంట నీరుతో స్టేజి మీదకి వచ్చి ప్రేమగా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంది.

తనే నలుగురు పిల్లల్ని కనీ  పెంచినట్టు ఆరేళ్ళ ఆ అమ్మాయి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది. 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో "7G బృందావన్ కాలని" లోని ఒక  "తలచి తలచి చూస్తే" అనే పాట ని పియానో తో ప్లే చేసారు.

అంతా బాగానే ఉంది, ఇక్కడ నాకర్ధం కాని విషయం చిన్న పిల్లలచేత ఇన్ని భావోద్వేగాలు పలికించాలనుకోవడం ఎంత వరకు సమంజసం.

అది డాన్సు షో. వాటిలో ఈ మధ్య చిన్నపిల్లలకి రకరకాల పాటలకు ఐటెం సాంగ్స్ కి మించిపోయేట్టు రకరకాలుగా డాన్సు స్టెప్పులు Choreograph చేస్తున్నారు. వాళ్ళ వయసు(మనసు)కి మించి వారితోటి రకరకాల భావోద్వేగాల్ని పలికిస్తున్నారు.

చిన్నపట్నించి పిల్లలకి చదువుతో పటు రక రకాల కళలపై ఆసక్తి కలిగించాలనుకోవడం అభినందించదగ్గ విషయం. కానీ వాటికే వారిని అంకితం చేయడం ఎంత వరకు న్యాయం.

పిల్లలకి వెంటనే పేరు వచ్చేయాలి అనే తాపత్రయంతో పెద్దలు పిల్లలకి జన్మ హక్కు అయిన ఒక వరాన్ని అందకుండా చేస్తున్నారు. ఆ వరం పేరే బాల్యం.అటువంటి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి. పిల్లల్ని అందమైన బాల్యానికి దూరం చేయకండి. వారు పెద్దయ్యాక మిమ్మల్ని తెమ్మన్నా తిరిగి తేలేరు వారి 'బాల్యాన్ని'.

మహాకవి శ్రీ శ్రీ గారి కవిత మరో సారి మనం గుర్తుచేసుకుందాం.

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు

- లాస్య రామకృష్ణ 
 

11 comments:

srinivasarao vundavalli said...

ఈమధ్యన ఈ రియాలిటి షోస్ శృతిమించుతున్నాయండి. టివి పెట్టాలంటేనే భయమేస్తుంది.

Ramakrishna said...

avunandi...

skvramesh said...

మీరన్నది నిజమే లాస్యరామకృష్ణగారు పిల్లల మనసులను మన సంస్కృతిని కూడా కలుషితం చేసే ఇలాటి షోస్ కి అంత ఫాలోయింగ్ ఉండడం అలాగే తల్లి తండ్రులకి ఆ షోస్ పట్ల ఉన్న క్రేజ్ నిజంగా దురదృష్టకరం ఈ కాలం పిల్లలకి వేమన పద్యాల కన్నా ఐటెం సాంగ్స్ బాగా తెలుస్తున్నాయి ఈ మార్పు ఏ దిశగానో? శ్రీ శ్రీ గారి చక్కటి కవిత ని అందించారు చాలా సంతోషమండి

సిరిసిరిమువ్వ said...

ఆ కార్యక్రమంలో ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకూ మీలానే అనిపించింది..అంత చిన్న పిల్ల చేత ఇలా చేయించాలా అని...భావోద్వేగాలని సొమ్ము చేసుకోవటమే ఇది! తల్లిదండ్రులకి కూడా ఇందులో పాత్ర ఉంటుంది..అదే బాధాకరం!

Lasya Ramakrishna said...

ఉండవల్లి శ్రీనివాసరావు గారు నా బ్లాగ్ కి స్వాగతం. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు.

Lasya Ramakrishna said...

ధన్యవాదములు రామకృష్ణ గారు

Lasya Ramakrishna said...

@skvrameshగారు ధన్యవాదములు . ఇటువంటి షోస్ పట్ల తల్లిదండ్రుల అభిప్రాయాలు మారాలని ఆశిద్దాం.

Lasya Ramakrishna said...

సిరిసిరిమువ్వ గారు మీరన్నది నిజమే.

the tree said...

చేయగలిగిందేమన్నా వుందా అండి, బలవ్వడం తప్ప....కొట్టుకుపోవడమే....

Lasya Ramakrishna said...

the tree గారు మీరు చెప్పింది నిజమే.

Teravanipusthakam said...

Its true