'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 3, 2012

ఆమె ఎవరు???

ఏదైనా రాయాలి. గొప్పగా రాయాలి . మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలి. కానీ, ఏం రాయను. దేని గురించి రాయను. కలం ముందుకి కదలట్లేదే! 

లోకం అంతా ప్రశాంతం గా ఉంది. అదేంటో ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఎవరి మీద దుమ్మేత్తలేదు. ఏ హీరోయిన్ గురించి గాస్సిప్స్ రాలేదు. ఎక్కడా సెన్సేషనల్ న్యూస్ లేదు. అరెరే ఇలా అయితే ఎలా?

ఒకే, ఇలాంటి సమయంలోనే శ్రీ శ్రీ గారిని తలచుకోవాలి. అయన పుస్తకాలు ఎక్కువ చదవక పోయినా, పెద్దగా ప్రాచుర్యంలో ఉన్న ఒక డైలాగు నాకు గుర్తుంది. అదే "కాదేది కవిత కనర్హం'. 

అవును కదా. అదే నిజం. నేనేదో సెన్సేషనల్ రచయిత్రి కావాలంటే మాత్రం ఏదైనా పెద్ద కుంభకోణం బయట పడాలా? ఎవరైనా పెద్ద హీరో కూతురు లేచిపోవాలా? అవసరమే లేదు. నేను ఎవరనుకున్నారు? ప్రముఖ న్యూస్ చానెల్స్ ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రేక్షకురాలిని.
కాబట్టి ఏ విషయం లేని సంఘటనకైనా నేను ఎంతో సెన్సేషన్ ని క్రియ్యేట్ చేయగలను.

రాసేస్తున్నాను. కాస్కోండి.

"అక్కడొక సామాన్య మధ్య తరగతి మహిళా రోడ్డు మీద నడచుకుంటూ వెళుతోంది. చూసారా, మన ప్రభుత్వం తీరు. ఒక మధ్య తరగతి మహిళ మండుటెండలో నడచుకుంటూ వెళుతోంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ఒక స్త్రీ మండుటెండలో నడచుకొని వెళ్ళడమా! ఎంత దిగజారిపోతోంది మన సమాజం. ఎక్కడికి వెళుతోంది ఈ లోకం. స్త్రీలకి గౌరవం ఇవ్వడం రాను రాను తగ్గిపోతున్న ఈ సమాజం లో ధైర్యం గా ఎలా బయటికి రా గలదు ఒక స్త్రీ. 

ప్రభుత్వం ఎన్నో బస్సులను లేడీస్ స్పెషల్ గా కేటాయించినా ఈవిడ  ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ప్రజలలో తగ్గిపోతున్న విలువలకి కారణం ఎవరు? ప్రజల అవసరాలకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడానికి కారణమెవరు? ఇదేనా స్త్రీకి మనమిచ్చే విలువ???"

మనలో మన మాట:- ఆవిడ కిరాణా షాపులోని సామాన్లు కొనుక్కొని పక్క వీధిలో నున్న తన ఇంటికి వెళుతోంది:-).

 - లాస్య రామకృష్ణ.

     

20 comments:

buddha murali said...

నిజమేనండి చాలా అన్యాయం జరిగిపోతోంది .. ఆకాశం లో సగం అన్నట్టుగానే రోడ్ పై సగం మహిళలకే కేటాయించాలి

సాయి said...

హహ.. నిజమే మరి...

బాగుంది...

మధురవాణి said...

హహ్హహ్హా.. Good one.. :)))))

శాండిల్య said...

మీలో మహాంచి కళాకారిణి దాగి ఉన్నట్టున్నట్టున్నట్టున్నారని నా అనుమానం.
త్వరగా బయటికి తరిమెయ్యండి.. అదేలే.. బయటికి లాగండి. లేదంటే ఇలాంటి మరెన్నో హాస్యాత్మక దారుణాలు మరుగున పడిపోయే ప్రమాదముంది.
ఇహపోతే.. మీరు రాసిన ఈ టపాలో మరొక్క మాట చేర్చి ఉంటే బావుండేది. "నేనెవరునుకున్నారు" అని మీరు అన్న తరవాత.. చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి లాగా.. "నేను కవయిత్రిని కానన్న వాణ్ని కత్తితో పొడుస్తాను" అని మీరు అనగానే మేమంతా మా కలాలు (పెన్నులు) బల్ల కింద పెట్టేసుకునేవాళ్ళం! "నేను రచయిత్రిని కానన్న వాణ్ని రాయిచ్చుక్కొడతాను" అని మీరు అనగానే మేమంతా ఒకళ్ళకొకళ్ళం రాళ్ళతో కొట్టేసుకునేవాళ్ళం... ఎంచక్కా. (హాస్యానికే ఇలా అంటున్నానండోయ్..మరోలా అనుకోరని ఆశిస్తున్నాను).

Anonymous said...

స్వతంత్ర భరత దేశం కనక ఆవిడ రోడ్ మీద నిర్భయంగా, మండు తెండలో ఇది నాకవిత్వమా! నడిచి ఇంటికి చేరగలిగింది. ప్రభుత్వం ఎండలో వెళ్ళె స్త్రీ లకి గొడుగు లివ్వాద్దూ? రేపే ధర్ణా!!! వచ్చెయ్యండి!!!

Lasya Ramakrishna said...

అవునండి మురళీ గారు, రోడ్డు పైన సగం మహిళలకే నడవడానికి ప్రత్యేకంగా కేటాయించాలి...

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు సాయి గారు.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు మధురవాణి గారు.

Lasya Ramakrishna said...

శాండిల్య గారు, మీకు జంధ్యాల గారు మలచిన పాత్ర గుర్తుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

Lasya Ramakrishna said...

కష్టేఫలి గారు, వచ్చేస్తున్నామండీ ధర్నాకి......

Zilebi said...

చాన్నెల్ వాళ్ళు వెంటనే ఆమె ముందు నిలబడి, మైకు పెట్టి కెమరా పట్టి

'ఏవండీ మీరిలా ఎండ బడి వెళ్తున్నారే! ఈ విషయమై గవర్నమెంటు ఎ చర్య తీసుకోవాలంటారు ? '


'ఆయ్, నేను నా ఒళ్ళు బరువు తగ్గటానికి నడిచి వెళ్తున్నా నండీ, గవర్నమెంటు వాళ్ళు వెంటనే ఫ్రీ గ ఏసీ తో వుండే 'ఫైట్ నెట్ ' సెంటర్ పెట్టా లండీ '

'ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లారా , వెంటనే మీరు ఎస్ ఎం ఎస్ లు పంపించండి, ఫైట్ నెట్ సెంటర్ పెట్టా లా వద్దా అన్న దాని మీద.

ప్రతి ఎస్ ఎం ఎస్ ఖరీదు వంద రూపాయలు మాత్రమె ! ఆలసించిన ఆశా భంగం. ఎస్ ఎం ఎస్ లో ల్లకి అమెరికా ఫ్రీ ట్రిప్పు గెలుచు కొనే మహాదావకాశాన్ని పొందండీ !!'


చీర్స్
జిలేబి.

SHANKAR.S said...

"లోకం అంతా ప్రశాంతం గా ఉంది. అదేంటో ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఎవరి మీద దుమ్మేత్తలేదు. ఏ హీరోయిన్ గురించి గాస్సిప్స్ రాలేదు. ఎక్కడా సెన్సేషనల్ న్యూస్ లేదు. అరెరే ఇలా అయితే ఎలా?"

తూచ్..తూచ్ నేనొప్పుకోను. మీరు మన న్యూస్ ఛానళ్ళని అవమానిస్తున్నారు. ఏ న్యూసూ లేకపోతే నాగయ్య గారికి, కత్రినా కైఫ్ కి మధ్య గొడవ అవడం వలెనే వాళ్ళు ఇద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదని చర్చా కార్యక్రమం పెట్టే ఘనులు మనోళ్ళు.

@జిలేబీ గారు

"ఎస్ ఎం ఎస్ లో ల్లకి అమెరికా ఫ్రీ ట్రిప్పు గెలుచు కొనే మహాదావకాశాన్ని పొందండీ !!"

మీరు మరీనండీ మన న్యూస్ ఛానళ్ళలో SMS చేస్తే బహుమతులు కూడానా? :))

Lasya Ramakrishna said...

బాగా చెప్పారండి జిలేబీ గారు. ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ అన్నీ ఎస్ ఎం ఎస్ ల మీదే ఆధారపడి నడుస్తున్నాయి.

Lasya Ramakrishna said...

"ఏ న్యూసూ లేకపోతే నాగయ్య గారికి, కత్రినా కైఫ్ కి మధ్య గొడవ అవడం వలెనే వాళ్ళు ఇద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదని చర్చా కార్యక్రమం పెట్టే ఘనులు మనోళ్ళు." - బాగా చెప్పారండి శంకర్ గారు.
అవసరం లేని టాపిక్స్ గురించి కూడా ఇద్దరు ముగ్గురిని స్టూడియోకి పిలిచి చర్చా కార్యక్రమం నడిపిస్తారు. ఆ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు చర్చ లో పాల్గొనడానికి వచ్చినవాళ్లు అతిగా రియాక్ట్ అయ్యి కొట్టేసుకుంటారేమో అని అనిపిస్తుంది.

రసజ్ఞ said...

ఎండా భగ భగా మండిపోతున్నా, ధరలు ఆకాశాన్ని అంటుతున్నా బెదరక, తొణకక, ధైర్యంగా పచారీ కొట్టుకెళ్ళి, తన సామాలు తనే మోసుకుంటున్న మధ్యతరగతి మహిళను చూసి నా హృదయం ద్రవించిపోయింది ;)
చాలా బాగా వ్రాసేసారే! మీరు మీడియా కాదు కదా!!!!!!

@ శంకర్ గారూ
ఏ న్యూసూ లేకపోతే నాగయ్య గారికి, కత్రినా కైఫ్ కి మధ్య గొడవ అవడం వలెనే వాళ్ళు ఇద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదని చర్చా కార్యక్రమం పెట్టే ఘనులు మనోళ్ళు. నిజమే అండీ! బాగా చెప్పారు!

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు రసజ్ఞగారు :-)

మాలా కుమార్ said...

గవర్నమెంట్ కు ఆడవాళ్ళంటే బొత్తిగా భయం భక్తి లేవండి :)

Lasya Ramakrishna said...

అవునండి మాలాకుమార్ గారు :-)

Anonymous said...

మీ పేరులాగా మీ టపా కూడా బావుంది.

Lasya Ramakrishna said...

నా పేరు, నా టపా నచ్చినందుకు ధన్యవాదములు లలిత గారు. నా పేరంటే నాక్కూడా చాలా ఇష్టం సుమండీ. నా పేరులో మీ పేరు కుడా కలుస్తుందండి. నా పూర్తి పేరు లలిత లాస్య.