'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 27, 2012

ఇట్లు ఓ యువతి...

మొన్నేమయిందో తెలుసా.....నేనేమో కష్ట పడి టీవీ ప్రోగ్రాం "మా ఇంటి వంట" చూసి మా ఇంట్లో ఏదో ప్రయోగం చేస్తున్నాను. అదేనండి ఆ వంట వండుతున్నాను. ఎందుకంటే, అ వంట రుచి మావారికి చూపించి, బాగుంటే నేను తిని ఇద్దరం కలిపి మూవీ కి వెళ్ళాలన్నది మా వీకెండ్ ప్లాన్. 
సరే మూవీ అనే ఒక ఆసక్తి కరమైన అంశం ఉంది కాబట్టి ఏదో ఇవాళ అయినా  కాస్త వంట బాగా చేసి మా వారి మెప్పు పొందుదామని అంత హడావిడిగా, ఏకాగ్రత తో వండుతున్నాను. సాధారణంగా, అంత ఏకాగ్రతతో వండితే పదార్ధం, ఐ మీన్ వంట బాగా కుదురుతుంది. కాని నా విషయం లో అలా జరగలేదు. ఎందుకో మీరే చదవండి...

నేను చక్కగా టీవీ లో చూపెట్టినట్టు ఉప్మా తయారు చేద్దామని అనుకుంటుండగా, మా వారి స్నేహితుడు ఉరుము ఉరిమి నట్టు అదర బాదరాగా మా ఇంటికి వచ్చాడు. ఏ నిమిషమైతే ఇతను వచ్చాడో అప్పుడు నాకర్ధమైంది ఇవాళ మూవీ కేన్సిల్ అని. ఎందుకంటే, అతను ఎప్పుడొచ్చిన ఏదో ఒక ప్రత్యేకమైన సమస్యతో మా వారి సలహా అడగడానికి వస్తాడు. మా వారు మనుషుల మనస్తత్వాన్ని బట్టి వారికి సూచనలు ఇస్తారు. పోనీ అదేదో ఆఫీసు సమస్య అంటే కానే కాదు. వాళ్ళావిడతో సమస్యట. 

ఇతను వంకాయ కూర చేస్తానంటే వాళ్ళావిడ బెండకాయ చెయ్యమందట. దాంతో ఇతని ఈగో దెబ్బతిని వంకాయ కూర వండి మరీ వచ్చాడట. అసలు సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఇంటికెల్లడానికి భయపడుతున్నాడు. 

మా వారు మనసులో 'మా ఆవిడ మరీ నా ఈగో దెబ్బతీయదు. నేనేం వండినా కాం గా తింటుంది అని సంబరపడినట్టున్నారు' వెంటనే అతనితో "ఇది ఒక సమస్య. మీ భార్యభార్తలిద్దరికి అవగాహన లోపం ఉంది. కొంచెం సర్దుకుపోవాలి అని నచ్చచెప్పారు. వెంటనే 'ఏమోయి' అని నన్ను పిలిచి బెడ్రూంలోకి తీసుకెళ్ళారు. నేను కొంచెం సిగ్గుపడి ఏంటండి మరీను వేలా పాలా లేకుండా అంటే 'నీ మొహం, నేను పిలిచింది ఎందుకంటే వాడి భార్యకి నువ్వు నచ్చ చెప్పి ఎలాగోలా వీడి సమస్యను పరిష్కరించు అన్నారు. 

దాంతో, నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపట్నించి, ఏదో ఒక గొప్ప పని చేసి, 'కర్తవ్యం' విజయశాంతి లాగా  హీరోయిన్ ఓరియంటెడ్ సీన్ నా లైఫ్ లో జరగాలని ఆశించాను. కానీ ఇప్పటి వరకు అలాంటి అవకాశం రాలేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినయోగం పరచుకోవాలన్న సదుద్దేశంతో ముందడుగు వేసాను.

ఆ సంతోషం లో నేను చేసిన ఉప్మా లో ఇడ్లి రవ్వ దర్శనమిచింది. 

కట్ చేస్తే, మేము ముగ్గురం మా వారి స్నేహితుడి ఇంటికి అతని భార్యకి నచ్చచెప్పడానికి వెళ్ళాం. అక్కడ, ఆ అమ్మాయి చాలా సేపటినుండి ఏడుస్తున్నట్టుంది కళ్ళు వాచిపోయాయి. వాల్లాయనని చూడగానే గబాలున లేచి దగ్గరకి వొచ్చి మేమున్నామని కూడా గమనించనట్టు వాటేసుకుని, 'ఏవండి, నా మీద అంత కోపమెందుకు. ఏదో బెండకాయ కూర చెయ్యమని అడిగానే అనుకోండి అలా వెళ్ళిపోవాలా. మీ మీద ప్రేమతో వంకాయ కూర మొత్తం తినేసానండి. ఇంకెప్పుడు ఇలా వెళ్ళిపోకండి. మీరేం వండినా రుచిగానే ఉంటుంది. ఐ యాం సారీ!!!" అంది. ఇద్దరు కలిసి మేము అనే ఇద్దరం మనుషులం వాళ్ళింటికి వచ్చామని మర్చిపోయి మరీ లోపలికి సంతోషంగా ఒక డ్యూయెట్ పాడుకోవడానికి వెళ్ళిపోయారు. 

మళ్లీ కట్ చేస్తే ఇడ్లీ రవ్వ ఉప్మా మా వారికి పెట్టి, సినిమాకి బయలుదేరితే అప్పటికే "హౌస్ ఫుల్ " బోర్డు అందంగా వెక్కిరించింది.

నీతి:- ఉప్మా లో ఇడ్లి రవ్వ వెయ్యకూడదు!!!

ఇట్లు ఓ యువతి.11 comments:

'Padmarpita' said...

నీతి తెలిసిందిగా :-)

Raghu said...

సినిమా టిక్కట్లు అంది సినిమా చూసివచ్చిన తర్వాత ఇడ్లి రవ్వ ఉప్మా అయినా ఉప్పు తో ఉప్మా అయినా అధ్భుతంగా ఉంటుంది. ఈ ఆదివారం ప్రయొగించండి. క్షమించండ్, వండండి! ఆ టార్చర్ కంటే ఉప్మా మెరుగు అనిపిస్తుంది.

Anonymous said...

IDLI UPMA RUCHI ELA UNDO CHEPPANE LEDU... :)

Lasya Ramakrishna said...

@పద్మార్పిత : అవునండి. నీతి కొంచెం లేట్ గా తెలిసింది.

Lasya Ramakrishna said...

@రఘు: అవునండి. ఈ మధ్య సినిమాలు అలాగే ఉన్నాయి. సినిమా చూసాక ఎదీ సినిమాకంటే పెద్ద సమస్యగా అనిపించదు. కానీ మనసుకు అహ్లాదానిచ్చే మంచి సినిమాలు కూడా అప్పుడప్పుడు వస్తున్నాయండి.

Lasya Ramakrishna said...

@puranapandaphani: ఇడ్లీ ఉప్మా రుచి ఎలా ఉన్నా, ఈ రెసిపీని మాత్రం టివి వాళ్లకి పంపించాలని డిసైడ్ అయ్యానండి.

మాలా కుమార్ said...

ఉప్మా ఇడ్లీరవ్వతో కాదా చేసేది ? నాకు తెలీదే ! మీ నీతి నేనూ తెలుసుకున్నానులెండి :)

కృష్ణప్రియ said...

బాగుంది. అన్నింటి కన్నా మీరు డిరైవ్ చేసిన నీతి:)

Lasya Ramakrishna said...

ధన్యవాదములు మాలాకుమారి గారు. కాదేదీ ఉప్మా కనర్హం :-)

Lasya Ramakrishna said...

నేను డిరైవ్ చేసిన నీతి మీకు నచ్చినందుకు ధన్యవాదములు కృష్ణ ప్రియ గారు :-)

Teravanipusthakam said...

:-)