'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jun 27, 2013

జయభేరి

మహా కవి శ్రీ శ్రీ గారి కవిత 

జయభేరి

నేను సైతం 
ప్రపంచాగ్నికి 
సమిధనొక్కటి ఆహుతిచ్చాను! 
నేను సైతం 
విశ్వవృష్టికి 
అశ్రువొక్కటి ధారపోశాను! 
నేను సైతం 
భువనఘోషకు 
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను! 
* * * 
ఎండకాలం మండినప్పుడు 
గబ్బిలం వలె 
క్రాగిపోలేదా! 
వానకాలం ముసిరి రాగా 
నిలువు నిలువున 
నీరు కాలేదా? 
శీతకాలం కోత పెట్టగ 
కొరడు కట్టీ, 
ఆకలేసీ కేకలేశానే! 
* * * 
నే నొక్కణ్ణీ 
నిల్చిపోతే- 
చండ్రగాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు 
భూమి మీదా 
భుగ్నమవుతాయి! 
నింగినుండీ తొంగిచూసే 
రంగు రంగుల చుక్కలన్నీ 
రాలి, నెత్తురు కక్కుకుంటూ 
పేలిపోతాయి! 
పగళ్లన్నీ పగిలిపోయీ, 
నిశీథాలూ విశీర్ణిల్లీ, 
మహాప్రళయం జగం నిండా 
ప్రగల్భిస్తుంది! 
* * * 
నే నొకణ్ణి ధాత్రినిండా 
నిండిపోయీ- 
నా కుహూరుత శీకరాలే 
లోకమంతా జల్లులాడే 
ఆ ముహూర్తాలాగమిస్తాయి! 
* * * 
నేను సైతం 
ప్రపంచాబ్జపు 
తెల్లరేకై పల్లవిస్తాను! 
నేను సైతం 
విశ్వవీణకు 
తంత్రినై మూర్ఛనలు పోతాను! 
నేను సైతం 
భువన భవనపు 
బావుటానై పైకి లేస్తాను!

- సేకరణ 
లాస్య రామకృష్ణ 

No comments: