ఏదైనా రాయాలి. గొప్పగా రాయాలి . మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలి. కానీ, ఏం రాయను. దేని గురించి రాయను. కలం ముందుకి కదలట్లేదే!
లోకం అంతా ప్రశాంతం గా ఉంది. అదేంటో ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఎవరి మీద దుమ్మేత్తలేదు. ఏ హీరోయిన్ గురించి గాస్సిప్స్ రాలేదు. ఎక్కడా సెన్సేషనల్ న్యూస్ లేదు. అరెరే ఇలా అయితే ఎలా?
ఒకే, ఇలాంటి సమయంలోనే శ్రీ శ్రీ గారిని తలచుకోవాలి. అయన పుస్తకాలు ఎక్కువ చదవక పోయినా, పెద్దగా ప్రాచుర్యంలో ఉన్న ఒక డైలాగు నాకు గుర్తుంది. అదే "కాదేది కవిత కనర్హం'.
అవును కదా. అదే నిజం. నేనేదో సెన్సేషనల్ రచయిత్రి కావాలంటే మాత్రం ఏదైనా పెద్ద కుంభకోణం బయట పడాలా? ఎవరైనా పెద్ద హీరో కూతురు లేచిపోవాలా? అవసరమే లేదు. నేను ఎవరనుకున్నారు? ప్రముఖ న్యూస్ చానెల్స్ ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రేక్షకురాలిని.
కాబట్టి ఏ విషయం లేని సంఘటనకైనా నేను ఎంతో సెన్సేషన్ ని క్రియ్యేట్ చేయగలను.
రాసేస్తున్నాను. కాస్కోండి.
"అక్కడొక సామాన్య మధ్య తరగతి మహిళా రోడ్డు మీద నడచుకుంటూ వెళుతోంది. చూసారా, మన ప్రభుత్వం తీరు. ఒక మధ్య తరగతి మహిళ మండుటెండలో నడచుకుంటూ వెళుతోంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ఒక స్త్రీ మండుటెండలో నడచుకొని వెళ్ళడమా! ఎంత దిగజారిపోతోంది మన సమాజం. ఎక్కడికి వెళుతోంది ఈ లోకం. స్త్రీలకి గౌరవం ఇవ్వడం రాను రాను తగ్గిపోతున్న ఈ సమాజం లో ధైర్యం గా ఎలా బయటికి రా గలదు ఒక స్త్రీ.
ప్రభుత్వం ఎన్నో బస్సులను లేడీస్ స్పెషల్ గా కేటాయించినా ఈవిడ ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ప్రజలలో తగ్గిపోతున్న విలువలకి కారణం ఎవరు? ప్రజల అవసరాలకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడానికి కారణమెవరు? ఇదేనా స్త్రీకి మనమిచ్చే విలువ???"
మనలో మన మాట:- ఆవిడ కిరాణా షాపులోని సామాన్లు కొనుక్కొని పక్క వీధిలో నున్న తన ఇంటికి వెళుతోంది:-).
- లాస్య రామకృష్ణ.
