
అదేంటో అప్పుడప్పుడు నాకు చాలా విచిత్రమైన కలలు వస్తుంటాయి. అవి ఎలాంటి కలలంటే, నిజజీవితానికి ఆ కలలకి ఎటువంటి సంబంధం ఉండదు. అందుకేనేమో, వాటిని కలలు అంటారు.
అలాంటి కలలు ఇవి కొన్ని.
1. రోజు వచ్చే ఆఫీసు క్యాబ్ బదులు ఒకసారి షేర్ ఆటో వచ్చింది. (రేసిషన్ టైం లో వచ్చిన కలలెండి).
2.ఒకసారి ఏకంగా ఫ్లైట్ వచ్చేసింది నన్ను ఆఫీసుకి పిక్ అప్ చేసుకోవడానికి.
సినిమాలకు సంబంధించిన కలలైతే బోలెడు. హీరో చిరంజీవి మా ఇంటికొచ్చాడు. త్రిష, తరుణ్ లకి నేను భోజనం వడ్డించాను.
ఇవన్ని ఆహ్లాదాన్నికలిగించే కలలైతే అప్పుడప్పుడు భయాన్ని కలిగించే కలలు కూడా వస్తుంటాయి.
రాత్రిపూట చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు కనుచూపు మేరలో ఎవరూ ఉండరు.
నేను పరిగెడుతున్నట్టు, ఎవరో వెంబడిస్తున్నట్టు, ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్టు ఇలా ఎన్నో.
అఫ్ కోర్స్, ఇలాంటి కలలు మనం టెన్షన్ పడుతున్నప్పుడు వస్తుంటాయని ఎక్కడో చదివాను. అందుకే సాధ్యమైనంత వరకు నేను అతిగా టెన్షన్ పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను.
ఇవి ఒకవైపయితే, నాకు భక్తీ కలలు కూడా చాల వస్తుంటాయి.
అమ్మవారు ఎర్రని చీరతో, బోలెడు నగలతో, నిండైన బొట్టుతో ఎంతో అందంగా వస్తుంటారు.
నేనొక పురాతన గుడికి వెళ్లినట్టు, అక్కడ అందమైన కొలనులో ఆడుకున్నట్టు ఇలా వస్తుంటాయి. ఆ కలలో ఉన్నంత సేపు ఆనందాన్నిస్తాయి.
అప్పుడప్పుడు నేనసలు చూడని క్రొత్త ప్రదేశాలు కూడా వస్తుంటాయి. అవి ఎంతో రియాలస్టిక్ గా ఉంటాయి. నేను ఆ ప్రదేశం లో ఎన్నో రోజులనుండి ఉండినట్టు అనిపిస్తుందన్నమాట.
క్రొత్త ప్రదేశాలంటే గుర్తొచ్చింది, రెండు మూడేళ్ళ క్రితం అనుకుంట ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఒకతను తనకి కలలో ఎప్పుడు చూడని ప్రదేశం వస్తుండేదని, తానెప్పుడు వెళ్ళని ఆ ప్రదేశం లో ఒక చర్చి కూడా కనిపించేదని. ఒకసారి, అతను అనుకోకుండా తన భార్య బిడ్డలతో ట్రిప్ కి వెళ్ళగా అక్కడ తన కలలో కనిపించిన ప్రదేశం, చర్చి కనిపిస్తే ఆశ్చర్యానికి గురయ్యాడని కలల గురించి ప్రచురించిన కాలమ్ లో అతను తన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఇదిలా ఉంటె మరొక ఆర్టికల్ చదివాను. ఒకతనికి తరచూ ఒక ముసలావిడ కలలోకి వచ్చేది. అతనికి ఆవిడ నిజంగానే ఉండుంటుందని గాఢమైన నమ్మకం ఏర్పడింది. ఇదే విషయం తన ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చిస్తే, ఇతను వర్ణించిన ప్రదేశాన్ని బట్టి, ఆవిడ రూపురేఖల్ని బట్టి ఆవిడ ఎక్కడుందో చెప్పారు. ఆ ముసలావిడని కలవడానికి ఇతను ఆ ఊరికి వెళ్ళగా అప్పటికే ఆవిడ మరణిస్తుంది. ఇంతకీ ఆవిడ ఇతని తల్లికి పురుడు పోసిన మంత్రసాని అట.
ఇలా కలలకి అంతే ఉండదు.
మనిషిని ఆకాశానికి ఎత్తేస్తాయి
నేలమీదకు పడేస్తాయి
కొత్త ప్రదేశాలకు తీసుకెళతాయి
జ్ఞాపకాలకు రూపాన్నిస్తాయి
కలల గురించి ప్రసిద్దమైన అభిప్రాయం కూడా ఉంది. అదేంటంటే కలలు భవిష్యత్తును సూచిస్తాయని.
కలలు అందంగా ఉన్న మాత్రాన కలలోనే ఉండిపోలేము. బాధ కలిగించినంత మాత్రాన మెలకువ రాకుండా పోదు. కలలకి భయపడి నిద్రకి దూరం కాలేము. అందమైన కలల కోసం నిద్రలోనే ఉండిపోలేము.
చివరగా చెప్పొచ్చేదేంటంటే, మంచి కల వచ్చిందనుకోండి మెలకువ వచ్చాక 'ఇది కలా' అని కొంచెం బాధేస్తుంది.అదే పీడకల అనుకోండి, మెలకువ రాగానే 'హమ్మయ్య, ఇది కలా' అనిపిస్తుంది.మొత్తానికి 'ఇది కలా' అని మాత్రం కచ్చితంగా అనిపిస్తుంది.